Revanth Reddy: నాడు అధర్మంపై ధర్మం విజయం సాధించేందుకు రాముడికి వానర సైన్యం ఎలా అండగా నిలిచిందో, నేడు ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ సైన్యం ఢిల్లీ వేదికపై కదం తొక్కిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దేశ రాజధానిలోని చారిత్రక రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ భారీ నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, తెలంగాణ భవన్ వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యకర్తల క్రమశిక్షణ, సంకల్పం ముందు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తలవంచక తప్పదని స్పష్టం చేశారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కావలసిన సీట్లు రాకపోవడంతో, ఆ కక్షతోనే దళితులు, గిరిజనులు, మైనార్టీలు, పేదల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను పసిగట్టి ప్రజాస్వామ్య పునాదులను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా పోరాటం ప్రారంభమైందన్నారు. ఇప్పటికే కోట్ల సంఖ్యలో ఓట్లను తొలగించారని, రాబోయే రోజుల్లో ఈ అక్రమాలను అడ్డుకోకపోతే మరింత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి రాకుండా అడ్డంకులు సృష్టించినప్పటికీ, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ నిరసన తెలపడం వారి పట్టుదలకు నిదర్శనమని చెప్పారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే ప్రసక్తే లేదని, రాజ్యాంగ పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
