YS Jagan: ప్రజాస్వామ్యంలో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం, పవిత్రమైన బాధ్యత ఓటు హక్కు. కానీ, వైఎస్సార్ జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరగడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు, దాడులు జరుగుతున్నాయని, తమ పార్టీ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను ఓటు వేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అయితే, ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం ఉన్న ఏ నాయకుడైనా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ తన ఓటు హక్కును వినియోగించుకోవడమే సరైన చర్య అని రాజనీతిజ్ఞులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తే, ఓటింగ్ నుంచి దూరంగా ఉండటం కంటే ఆ వ్యవస్థలోనే ఉంటూ ఓటు ద్వారా, చట్టపరమైన పోరాటాల ద్వారా దాన్ని ఎదిరించడమే ఒక బాధ్యతాయుతమైన నాయకుడి కర్తవ్యమని పేర్కొంటున్నారు.
ఒక వైపు శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడం, మరోవైపు అత్యంత కీలకమైన ఓటు హక్కును వినియోగించుకోకుండా నిరసన తెలపడం జగన్ రాజకీయ వైఖరిపై పలు అనుమానాలను, విమర్శలను రేకెత్తిస్తోంది. నాయకుడే ఓటు వేయకుండా వెనుదిరగడం వల్ల క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలలో, మద్దతుదారులలో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ఇది ప్రజాస్వామ్య పోరాటాల నుంచి పారిపోవడంతో సమానమని విశ్లేషకులు భావిస్తున్నారు. అసాధారణ పరిస్థితుల్లో ఓటు బహిష్కరణ అనేది తాత్కాలిక నిరసన రూపం కావచ్చు కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవడానికి ఓటు హక్కును వినియోగించుకోవడమే ఏకైక రాచమార్గమని స్పష్టమవుతోంది.
