రాత్రికి రాత్రే సెల్ టవర్ నిర్మాణం.. రేడియేషన్ భయంతో చౌటుప్పల్‌లో కాలనీవాసుల ఆందోళన!

Cell Tower

Cell Tower

Cell Tower: ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే సెల్ టవర్లను జనావాసాల మధ్య నిర్మించవద్దంటూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కేపీఆర్ కాలనీ వాసులు ఆందోళన బాట పట్టారు. కాలనీలోని 472వ ప్లాట్‌లో కొత్తగా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని కాలనీవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీవాసులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీసం అనుమతి పత్రాలు కూడా చూపించకుండా రాత్రికి రాత్రే సెల్ టవర్ నిర్మాణం ప్రారంభించారు. కేపీఆర్ కాలనీలో సుమారు 1,100 ప్లాట్లు, వందలాది గృహాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 3,000 మంది విద్యార్థులు చదువుకునే రెండు ప్రముఖ పాఠశాలలు కూడా ఈ ప్రాంతంలోనే కొనసాగుతున్నాయి.

జనావాసాలు, విద్యాసంస్థల మధ్య సెల్ టవర్ నిర్మిస్తే దాని ద్వారా వచ్చే ప్రమాదకర రేడియేషన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేపడుతున్న ఈ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ అధికారులకు, ఆర్‌డీఓ (RDO) కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు వెంటనే స్పందించి చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ టవర్ నిర్మాణ పనులను శాశ్వతంగా అడ్డుకోవాలని కోరారు.