స్కూల్ ముందు విద్యార్థులతో వెట్టిచాకిరీ.. ప్రిన్సిపాల్ పర్యవేక్షణలోనే మేస్త్రీ పనులు!

Student Labor

Student Labor

Student Labor: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన పాఠశాల యాజమాన్యం వారి చేత దారుణంగా కూలీ పనులు చేయిస్తోంది. చదువుకోవాల్సిన చిన్నారులు పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో పారలు పట్టిస్తూ మేస్త్రీలుగా మారుస్తున్నారు. చంపాపేట్‌లోని సిద్ధార్థ స్కూల్ వద్ద చోటుచేసుకున్న ఈ విచారకర ఘటన ప్రస్తుతం నగరవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాఠశాల ఆవరణ బయట రోడ్డు పక్కన పాఠశాల దుస్తుల్లో ఉన్న విద్యార్థులు పారతో సిమెంట్, ఇసుక కలుపుతూ పనులు చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలోనే ఇలాంటి పనులు చేయించడంపై తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు పిల్లలను పంపేది చదువుకోవడానికా లేక మేస్త్రీ పనులు చేయడానికా అని ప్రశ్నిస్తున్నారు.

అన్నింటికంటే దారుణమైన విషయమేమిటంటే.. విద్యార్థులతో రోడ్డుపై ఈ సిమెంట్ పనులు చేయిస్తున్న సమయంలో పాఠశాల ప్రిన్సిపాల్ పక్కనే నిలబడి పర్యవేక్షించడం. విద్యార్థుల భద్రత, గౌరవం, విద్యా హక్కుల రక్షణ విషయంలో పాఠశాల యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాల్సి ఉండగా, ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చిన్నారుల హక్కులను కాలరాస్తూ చాకిరీ చేయిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ (DEO) అధికారులు తక్షణమే స్పందించి ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. బాలల హక్కులను భంగపరిచిన సిద్ధార్థ స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యంపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.