5 లక్షలిచ్చి.. 15 లక్షలు గుంజారు! మహిళా డాక్టర్‌ను వేధించిన కిలాడీ ముఠా అరెస్ట్

Moneylending Fraud

Moneylending Fraud

Moneylending Fraud:  అధిక వడ్డీలతో అమాయకులకు నరకం చూపిస్తున్న ఖతర్నాక్ ముఠాను మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్ ఎస్‌ఓటీ, ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుమతి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ మహిళా డాక్టర్ క్యాన్సర్ రోగాన్ని ముందుస్తుగా గుర్తించే ఏఐ యంత్రం కొనుగోలుకు డబ్బులు అవసరం కావడంతో తెలిసిన వారిని సంప్రదించారు.

పరిచయస్థులు ఈ వడ్డీ ముఠాను డాక్టర్‌కు పరిచయం చేశారు. 30 లక్షల రుణం కావాలని అడగ్గా 2 శాతానికి పైగా వడ్డీకి ఇస్తామని నమ్మించారు. ముందుగా రూ.5 లక్షలు చెల్లిస్తే వారం రోజుల్లో మిగతా సొమ్ము ఇస్తామని చెప్పి, వారు ఇచ్చిన రూ.5 లక్షలకు ఏకంగా రూ.15 లక్షల వరకు వసూలు చేశారు. గ్యారంటీ పేరిట డాక్టర్‌కు చెందిన స్కోడా, ఇన్నోవా కార్లను తమ వద్దే పెట్టుకున్నారు. రూ.30 లక్షల ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, ఇతర పత్రాలు లాక్కుని మహిళా డాక్టర్‌ను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు.

ఈ మోసంపై బాధితురాలు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ఎస్‌ఓటీ పోలీసులు అక్టోబరు 25న కందాల శివ, ఇంద్రమ్మ, స్వప్నను అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితులపై నిరంతరం నిఘా ఉంచి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో కుంభం నాగమ్మ, కందాల గంగమ్మ, కందాల మంగమ్మ, అడుల్ల అనూషలను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.