Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైవాహిక జీవిత పరిణామాల ప్రచారంపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతో బాధ్యతాయుతంగా స్పందించాయి. ఈ అంశంపై ఎలాంటి అనుచిత పోస్టులు పెట్టవద్దని, వ్యక్తుల వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగవద్దని ఇటు అధికార భాగస్వామి తెలుగుదేశం పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ శ్రేణులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశాయి. అయితే, క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీలు హుందాతనం ప్రదర్శిస్తుంటే.. సోషల్ మీడియాలో జనసేన ముసుగులో ఉన్న కొందరు ఔత్సాహికులు, అభిమానులు మాత్రం నిరంతరం వివాదాస్పద పోస్టులతో మిత్రపక్షాల మధ్య వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు.
అనవసర వివాదాలు – జనసేన కేడర్ రాజకీయ అపరిపక్వత:
జనసేన పార్టీ డిజిటల్ వింగ్‌లో అధిక శాతం సినీ అభిమానులే ఉండటం, వారికి పార్టీ సంస్థాగత నిబంధనలు మరియు రాజకీయ లక్ష్మణరేఖలపై అవగాహన లేకపోవడమే ఈ సమస్యలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వయంగా పవన్ కల్యాణ్ పిఆర్ఓ అధికారికంగా విడాకుల ప్రెస్ నోట్‌ను విడుదల చేసినప్పటికీ.. ఆ సమాచారాన్ని టీడీపీ వర్గాలే మీడియాకు లీక్ చేశాయంటూ మిత్రపక్షంపై బురదజల్లే యత్నాలు సాగుతున్నాయి. మిత్రధర్మాన్ని విస్మరించి టీడీపీ శ్రేణులను కించపరచడం, ప్రతి అంశానికీ సంయమనం వీడి రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం వారి అపరిపక్వతకు అద్దం పడుతోంది.
వైసీపీ కోవర్టుల కుట్ర అనుమానాలు:
ఈ రగడ వెనుక పెద్ద ఎత్తున పొలిటికల్ కుట్ర దాగి ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానుల రూపంలో సామాజిక మాధ్యమాల్లో చెలరేగిపోతున్న కొందరు నిజానికి వైసీపీకి చెందిన కోవర్టులుగా సందేహిస్తున్నారు. టీడీపీ-జనసేన కూటమి మధ్య మనస్పర్థలు సృష్టించడమే లక్ష్యంగా కొందరు పవన్ భక్తుల ముసుగులో చంద్రబాబు, టీడీపీ నాయకత్వంపై తీవ్ర విషప్రచారం చేస్తున్నారు. అసలైన అమాయక జనసేన అభిమానులు ఈ కుట్రను గ్రహించలేక వారి ఉచ్చులో పడిపోతుండటం పార్టీ సీనియర్ నేతలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దిద్దుబాటు చర్యల అవసరం:
జనసేన అధిష్ఠానం మరియు పార్టీ అధికారిక డిజిటల్ వింగ్ తక్షణమే స్పందించి అసలైన కార్యకర్తలు ఎవరో, శత్రు పార్టీల కోవర్టులు ఎవరో వడపోసి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రపక్షాలపై బురదజల్లే ముసుగు ఖాతాలను బహిరంగంగా రద్దు చేయకపోతే.. అంతిమంగా నష్టపోయేది పవన్ కల్యాణ్ ఇమేజ్, కూటమి స్థిరత్వమేనని రాజకీయా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
