AI Police: శాంతిభద్రతల పరిరక్షణలో నూతన సాంకేతికతను వినియోగించడంలో భాగ్యనగర పోలీసులు మరో మైలురాయిని అధిగమిస్తున్నారు. దేశంలోనే అత్యంత ఆధునికమైన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట పీఎస్ రూపంతరం చెందుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన అనంతరం ఆయన ఈ వివరాలను పంచుకున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ నూతన విధానాన్ని డిసెంబర్ నెలలో డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఠాణా రిసెప్షన్లో ప్రత్యేకంగా ‘సేతు కియోస్క్’ను అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా బాధితులు ఏకంగా 10 విభిన్న భాషల్లో తమ ఫిర్యాదులను నమోదు చేసే అరుదైన అవకాశం లభిస్తుంది.
అంతేకాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఆధారంగానే ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు, కేసు డైరీ తయారీ, దర్యాప్తు నివేదికల విశ్లేషణ, ఛార్జ్‌షీట్ రూపకల్పన వేగవంతంగా జరగనున్నాయి. ఈ ఏఐ ఆధారిత వ్యవస్థ పనితీరుపై ఇప్పటికే పంజాగుట్ట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ, దర్యాప్తు మరింత వేగవంతం కానుందని యంత్రాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
