Visa Cancelled: హైదరాబాద్ వేదికగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్–2026’ సదస్సు ఆరంభానికి ముందే ఓ అనూహ్య వివాదం తెరపైకి వచ్చింది. ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రధాన వక్తగా పాల్గొనాల్సిన నార్వే దేశానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ హెల్లే లింగ్ స్వెండ్సెన్కు చివరి నిమిషంలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. సమ్మిట్లో భాగంగా ‘మీడియా భవిష్యత్తు – పత్రికా స్వేచ్ఛ’ అనే కీలక అంశంపై జరిగే చర్చాగోష్ఠిలో ప్యానెలిస్ట్గా తన గళం వినిపించేందుకు నిర్వాహకులు ఆమెను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ పర్యటనకు సంబంధించి భారత రాయబార కార్యాలయం తొలుత ఆమెకు వీసా మంజూరు చేసింది. సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ బయలుదేరడానికి సిద్ధమవుతున్న తరుణంలో, ఉన్నట్టుండి ఆమె వీసాను రద్దు చేస్తున్నట్లు అధికారులు సమాచారం అందించారు. కేంద్ర హోంశాఖలోని ఉన్నత స్థాయి అధికారుల ప్రత్యేక ఆదేశాల మేరకే తన వీసాను వెనక్కి తీసుకున్నట్లు తనకు తెలిసిందని హెల్లే లింగ్ స్వెండ్సెన్ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.
పత్రికా స్వేచ్ఛపై అంతర్జాతీయ వేదికపై చర్చ జరగాల్సిన సమయంలో, ఒక విదేశీ పాత్రికేయురాలి వీసాను మంజూరు చేసిన తర్వాతే రద్దు చేయడం ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారాన్ని రేపుతోంది.
