YS Jagan: సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు పోలీసులను కోరారు. ఈ మేరకు నర్సింగ్ పోలీస్ స్టేషన్లో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఆరె శ్యామల, యనమల నాగార్జున యాదవ్ తదితర నాయకులు నర్సింగ్ సీఐని కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ జనసేనకు చెందిన 300 మందికి పైగా వ్యక్తులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ పార్టీ అధినేత, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మహిళల పట్ల వారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమని పేర్కొన్నారు.
కేవలం ఫిర్యాదు మాత్రమే కాకుండా, సంబంధిత వీడియోలు, ఆడియోలు, వాటిని హోస్ట్ చేసిన వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు సమర్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళల గౌరవం, భద్రత విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపై పార్టీలు, రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరారు.
