Gig Workers: తెలంగాణ రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల (Gig Workers) సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు తదితర అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రూపొందించిన ‘గిగ్ వర్కర్స్ పాలసీ’ని నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సీఎం, గిగ్ వర్కర్ల సంక్షేమ పాలసీ అమలుపై కీలక వివరాలను వెల్లడించారు.
ఎండనక, వాననక నిత్యం ప్రజలకు సేవలందిస్తూ శ్రమిస్తున్న గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణ, సామాజిక భద్రత కోసం తమ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ చారిత్రాత్మక పాలసీని గిగ్ వర్కర్ల సమక్షంలోనే అధికారికంగా వారికి అంకితం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రత్యేకంగా రాష్ట్రానికి ఆహ్వానించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘భారత్ సమ్మిట్’ సదస్సులో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ నగరానికి చేరుకునున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు ఆయన రాష్ట్రంలోని గిగ్ వర్కర్లతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలు, ఆకాంక్షలను అడిగి తెలుసుకోనున్నారు. ఇదే వేదికపై తెలంగాణలోని దాదాపు 6 లక్షల మంది గిగ్ వర్కర్ల సంక్షేమం, బీమా సౌకర్యాలు, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు (రూల్స్ అండ్ రెగ్యులేషన్స్), ప్రత్యేక సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించనున్నారు.
ఎలాంటి ఉద్యోగ భద్రత, బీమా రక్షణ లేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది గిగ్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పాలసీ అమలుతో కార్మికుల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా లభించనుందని కార్మిక సంఘాలు, గిగ్ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
