అభివృద్ధి వేటుకు బలవుతున్న బాల్యం.. తక్షశిలా ‘నేస్తాన్ని’ కాపాడేదెవరు?

Childhood Memories

Childhood Memories

Childhood Memories: బాల్యం ఎన్నో మధుర జ్ఞాపకాల సమాహారం. పెరిగి పెద్దయ్యాక మనిషి ఎక్కడ ఉన్నా, ఆ చిన్ననాటి తీపి గుర్తులు మాత్రం ఎప్పటికీ పచ్చగానే ఉంటాయి. అలాంటి అపురూపమైన బాల్య జ్ఞాపకాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది ఓ సీమ చింతకాయ (వాడుకలో చీమచింతకాయ) చెట్టు.

ఎల్బీ నగర్‌లోని సిరీస్ రోడ్డులో ఉన్న న్యూ తక్షశిలా స్కూల్‌(పూర్వనామం తక్షశిలా హై స్కూల్)కు చెందిన ఎందరో పూర్వ విద్యార్థులకు ఈ చెట్టుతో విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యంగా చెట్టు నిండా ముళ్లు గుచ్చుకుంటున్నా ఏమాత్రం లెక్కచేయకుండా అంతెత్తుకు ఎక్కి కాయలు తెంపుకున్న రోజులు నేటికీ వారి కళ్లముందే కదలాడుతున్నాయి.

పైకి ఎక్కేటప్పుడు ఉండే ఉత్సాహం కంటే, కిందకు దిగేటప్పుడు వేసే భయం, చెట్టు కింద నిలబడి రాళ్లతో కొడుతూ రాలిన కాయలను పోటీపడి ఏరుకున్న ఆటలు ఒక అరుదైన మధురానుభూతిని పంచాయి. దశాబ్దాల వయసున్న ఆ మహావృక్షం, నాటి తరం విద్యార్థులందరికీ ఓ ప్రియమైన నేస్తం.

అయితే, కాలక్రమంలో జరిగిన నగర విస్తరణలో భాగంగా ఒకప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఈ చెట్టు నేడు ప్రధాన రహదారికి అడ్డుగా మారింది. మున్సిపాలిటీ అధికారుల దయవల్ల ఇప్పటికీ ప్రాణాలతో నిలిచి ఉన్నప్పటికీ, అభివృద్ధి పనుల నేపథ్యంలో ఏ క్షణమైనా ఈ చెట్టును కొట్టేసే ప్రమాదం పొంచి ఉంది. ఈ వృక్షాన్ని కాపాడాలని, చెట్టును వేళ్లతో సహా తరలించి (ట్రాన్స్‌లోకేట్ చేసి) మరో సురక్షిత ప్రాంతంలో నాటే సంస్థలకు గతంలో విజ్ఞప్తి చేసినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు.

ఆ చెట్టు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియని ఆవేదన ఒకవైపు, తన బాల్యపు జ్ఞాపకాలను తన తర్వాతి తరానికి పరిచయం చేయాలనే తపన మరోవైపు.. ఇటీవల ఆ రహదారిపై వెళ్తున్న సమయంలో ఆ చెట్టు వద్ద తన ఇద్దరు చిన్నారులను నిలబెట్టి ఫోటో తీసి మురిసిపోయారు ఓ పూర్వ విద్యార్థి. ఆ చెట్టు కూలిపోయినా, ఆ జ్ఞాపకాలు మాత్రం తరతరాలకు పదిలంగా ఉండాలనేదే ఆ తండ్రి ఆకాంక్ష.