Cyber Espionage: దేశ రక్షణ రహస్యాలను రాబట్టేందుకు విదేశీ నిఘా సంస్థలు అనుసరిస్తున్న కొత్త తరహా వ్యూహాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగే హనీ ట్రాప్ కంటే కూడా, దాని వెనుక దాగి ఉన్న సైబర్ గూఢచర్యం (సైబర్ ఎస్పియోనేజ్) నుంచే దేశానికి అత్యధిక ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ‘ఏఎస్ఐ నేషనల్ సెక్యూరిటీ సమ్మిట్ 3.0’లో ఆయన ప్రసంగిస్తూ కీలక విషయాలను వెల్లడించారు.
ఆర్థిక మోసాలు, సైబర్ వార్ఫేర్ ముప్పు:
శత్రుదేశాల నిఘా సంస్థలు కేవలం హనీ ట్రాప్ వల విసరడమే కాకుండా, దాని వెనుక పెద్ద ఎత్తున సైబర్ వార్ఫేర్, ఆర్థిక మోసాలతో కూడిన గూఢచర్య వ్యవస్థను నడుపుతున్నాయని అశుతోష్ దీక్షిత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రక్షణ పరిశోధన సంస్థలతో పాటు ప్రైవేట్ రక్షణ రంగ కాంట్రాక్టర్లను సైతం విదేశీ ఏజెంట్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. రకరకాల ఆశలు చూపి సున్నితమైన సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ కుట్రలలో మల్టీ-లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థలు, లోన్ షార్క్ల పాత్ర కూడా ఉంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హార్డ్వేర్పై దాడి అసాధ్యం.. అందుకే వ్యక్తులే టార్గెట్!
భారత సైనిక కమ్యూనికేషన్ నెట్వర్క్లు సాధారణ ఇంటర్నెట్కు పూర్తిగా దూరంగా, అత్యంత సురక్షితమైన ‘ఎయిర్-గ్యాప్డ్’ (Air-gapped) విధానంలో పనిచేస్తాయని ఆయన వివరించారు. అందువల్ల సైనిక హార్డ్వేర్ వ్యవస్థలపై నేరుగా సైబర్ దాడులు చేయడం శత్రువులకు అసాధ్యమన్నారు. ఈ కారణంగానే విదేశీ నిఘా హ్యాండ్లర్లు సాంకేతికతను కాకుండా, ఆయా విభాగాల్లో పనిచేసే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్నారని చెప్పారు.
విదేశీ సంస్థల కుట్రలను తిప్పికొట్టేందుకు భారత సైన్యం, రక్షణ పరిశోధన సంస్థలు పటిష్టమైన సాంకేతిక రక్షణ కవచాలను ఏర్పాటు చేసుకున్నాయని ఆయన భరోసా ఇచ్చారు. ప్రైవేట్ రక్షణ రంగ సంస్థలు తమ నెట్వర్క్లను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో సూచించేందుకు ప్రత్యేక ఏజెన్సీ పనిచేస్తోందని వెల్లడించారు.
