మూఢనమ్మకాలను జయించి.. మంచు గడ్డపై ప్రాణాలు పోసిన ధీరమహిళ!

Tsering Landol

Tsering Landol

Tsering Landol: కన్నతల్లి పడిన ప్రసవ వేదన ఓ కుమార్తె గుండెను కలచివేసింది. మరే తల్లీ అలాంటి నరకయాతన అనుభవించకూడదన్న ఆ ఒక్క సంకల్పమే ఆమెను చరిత్ర సృష్టించేలా చేసింది. ఇష్టపడి, కష్టపడి చదివి మంచు కొండల నడుమ ఉన్న లద్దాక్ ప్రాంతంలోనే తొలి మహిళా గైనకాలజిస్ట్‌గా ఎదిగిన డాక్టర్ సెరింగ్ లాండోల్ జీవిత ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

అడ్డుగోడలను దాటి వైద్య విద్య వైపు

లద్దాక్‌లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సెరింగ్ లాండోల్, తన కుటుంబంలోనే బడి మెట్లెక్కిన తొలి తరం బిడ్డ. ప్రసవ సమయంలో మహిళలను కుటుంబాలకు దూరంగా ఉంచే మూఢనమ్మకాలు, కనీస వైద్యం అందక తన తల్లి పడిన ఇబ్బందులను చిన్నతనంలోనే కళ్లారా చూశారు. ఇంగ్లీష్ రాకపోయినా పట్టుదలతో ఉర్దూ మాధ్యమంలో సైన్స్ చదివి మెడికల్ సీటు సాధించారు. శ్రీనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎండీ పూర్తి చేసి, 1979లో లేహ్ జిల్లా ఆసుపత్రిలో లద్దాక్ తొలి మహిళా గైనకాలజిస్ట్‌గా అడుగుపెట్టారు.

మైనస్ 20 డిగ్రీల చలిలో సేవా యజ్ఞం

ఆ రోజుల్లో ఆసుపత్రిలో కనీసం కరెంట్, నీటి వసతి కూడా ఉండేవి కావు. ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలకు పడిపోయేవి. డ్రమ్ముల్లో గడ్డకట్టిన మంచును పగలగొట్టి, కిరోసిన్ స్టవ్‌లపై నీటిని వేడి చేస్తూ ఆపరేషన్లు చేసేవారు. ఆసుపత్రిలో వసతులు చాలనప్పుడు గ్లౌజులు, మందులు, వ్యాక్యూమ్ పరికరాలను సంచిలో వేసుకుని మంచు దారుల్లో నడుస్తూ ఇంటింటికీ వెళ్లి పురుళ్లు పోశారు.

మూఢనమ్మకాలను చెరిపేసి.. ఆరోగ్య వెలుగులు నింపి

మారుమూల గ్రామాలకు వెళ్లి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూ పోషకాహారం, పరిశుభ్రత, కుటుంబ నియంత్రణపై మహిళల్లో చైతన్యం తెచ్చారు. ఏనాడూ ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా దశాబ్దాల పాటు నిస్వార్థ సేవలందించారు. ఆమె అంకితభావానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ, 2020లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.