ఖాకీలకు ప్రమోషన్ల పండుగ.. ఏళ్లనాటి సీనియారిటీ చిక్కుముడిని విప్పిన డీజీపీ!

Police Promotions

Police Promotions

Police Promotions: తెలంగాణ పోలీస్ శాఖలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన ప్రమోషన్ల చిక్కుముడిని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించారు. 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సివిల్ ఎస్‌ఐ బ్యాచ్ అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. జీవో 74, కాంతారావు కమిటీ నివేదిక, రోస్టర్ నిబంధనలను సమీక్షించి, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఖాళీల వివరాలను వివరించడంతో అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

రెండు విడతల్లో అదనపు ఎస్పీ పోస్టుల భర్తీ

డీఎస్పీ స్థాయి అధికారులకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు రెండు విడతల ప్రణాళికను సిద్ధం చేశారు. తొలి విడతలో భాగంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న 54 అదనపు ఎస్పీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. అలాగే 2027 ఆగస్టు నాటికి ఖాళీ కానున్న మరో 34 పోస్టులను రెండో విడతలో భర్తీ చేయనున్నారు.

నాన్-క్యాడర్ ఎస్పీ పోస్టులపైనా స్పష్టత

ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని 12 మంది అదనపు ఎస్పీలకు వెంటనే నాన్-క్యాడర్ ఎస్పీలుగా ప్రమోషన్ ఇవ్వనున్నారు. వీటికి తోడు ప్రస్తుత ప్యానెల్ ఇయర్‌లో మరో 10 నాన్-క్యాడర్ ఎస్పీ పోస్టులను కేటాయించనున్నారు. సీనియారిటీ నిబంధనల ప్రకారమే పదోన్నతులు ఉంటాయని, ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని డీజీపీ భరోసా ఇచ్చారు. ఈ నిర్ణయాలను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు వెలువరించనుండటంతో పోలీస్ వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.