శ్రీశైల దేవస్థానం జీవో శ్రీనివాసరావు పలుచోట్ల ఆకస్మిక పరిశీలన

Srisailam

Srisailam

Srisailam: పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు  ఈ రోజు  సాయంత్రం  పలువిభాగాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఉచిత ప్రసాద వితరణ, లడ్డు ప్రసాదాల విక్రయకేంద్రాలు మరియు అన్నప్రసాదవితరణ విభాగాలను పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ అమ్మవారి ఆలయం వెనుకభాగంలో  భక్తులకు అందజేస్తున్న ఉచిత ప్రసాద వితరణ ఎటువంటి అంతరాయం లేకుండా జరుగుతుండాలన్నారు. దర్శనాల ప్రారంభం నుంచి దర్శనాలు ముగిసేంతవరకు ఈ ప్రసాదవితరణ ఉండాలన్నారు. ఆలయ అధికారులు ఈ ప్రసాద వితరణను నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు.  స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న ప్రతీ భక్తుడికి కూడా ఉచిత ప్రసాదం అందజేయడం ఎంతో ముఖ్యమన్నారు.
తరువాత లడ్డుప్రసాదవిక్రయ కేంద్రాలను పరిశీలించారు. భక్తులు అధికసమయం క్యూలైన్లలో వేచివుండకుండా త్వరితంగా ప్రసాదాలను అందించేందుకు చర్యలు చేపట్టాలని విక్రయకేంద్ర పర్యవేక్షకులను ఆదేశించారు.  ముఖ్యంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులరద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అవసరం మేరకు అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
అనంతరం అన్నప్రసాద వితరణ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ  అధికారులు ప్రతీరోజు కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించే భక్తులతో  మాట్లాడుతూ వారియొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు.  ముఖ్యంగా అన్నప్రసాదాల వడ్డన, రుచి మొదలైన అంశాల గురించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా కాలాతీతం కాకుండా నిర్ణీత వేళలో అన్నప్రసాద వితరణ ప్రారంభం కావాలన్నారు. అన్నప్రసాదవితరణలో శివసేవకుల సేవలను విరివిగా వినియోగించుకోవాలన్నారు.  అన్నప్రసాదాల వడ్డన తదితర అంశాలపై శివసేవకులకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు.
  అదేవిధంగా అన్నప్రసాదాల వడ్డనపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.  ప్రతీ వంటకం కూడా ప్రతీ భక్తుడికి చేరేవిధంగా పర్యవేక్షణ ఉండాలన్నారు.   ప్రతీ హాలును కూడా సిబ్బంది ప్రత్యేకంగా నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. అన్నప్రసాదాల తయారీలో తాజా కూరగాయలనే వాడాలన్నారు.  అదేవిధంగా రోజువారీ వంటకాలలో పలురకాల కూరగాయలు వాడాలని అధికారులను ఆదేశించారు. వంటకాలు రుచికరంగా ఉండేవిధంగా అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అన్నప్రసాదవితరణ వంటశాలలోనూ, ప్రసాదవితరణ చేసే హాలులలోనూ మరియు భవన ప్రాంగణములో శుచీ శుభ్రతపట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.  కాగా ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారివారు ఉచిత ప్రసాదవితరణ వద్ద పలువురు భక్తులతో నేరుగా మాట్లాడి దేవస్థానం కల్పిస్తున్న సదుపాయాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.