Journalists Protest: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన నిజమైన ఉద్యమ జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరించిందని ఎల్బీ నగర్ ఉద్యమ జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు శ్రీకాంతాచారి సాక్షిగా, ఎల్బీ నగర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి మంగళవారం వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిజమైన ఉద్యమ జర్నలిస్టులను ప్రభుత్వం తక్షణమే గుర్తించి, వారికి రావాల్సిన హక్కులు, అన్ని రకాల ప్రభుత్వ రాయితీలను కల్పించాలని డిమాండ్ చేశారు.
నకిలీ ఉద్యమకారుల పట్ల అప్రమత్తత అవసరం
ఈ సందర్భంగా ఉద్యమ జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఇటీవల కొంతమంది తామే ఉద్యమ జర్నలిస్టులమంటూ సమావేశాలు నిర్వహిస్తూ స్వలాభం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వారంతా కేవలం ఉద్యమ కాలం నాటి జర్నలిస్టులు మాత్రమేనని, ప్రత్యక్ష ఉద్యమ పోరాటాల్లో పాల్గొన్న వారు కాదని స్పష్టం చేశారు. ఉద్యమ జర్నలిస్టుల ముసుగులో లబ్ధి పొందాలని చూస్తున్న వారి పట్ల నిజమైన పోరాటయోధులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
వెలవెలబోయిన ఆత్మీయ సమ్మేళనం
మరోవైపు, ఉద్యమ జర్నలిస్టుల పేరుతో ఒక వర్గం ఏర్పాటు చేసిన ‘ఆత్మీయ సమ్మేళనం’ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. నిజమైన ఉద్యమ జర్నలిస్టుల తీవ్ర వ్యతిరేకత, బహిష్కరణ పిలుపు నేపథ్యంలో ఆ కార్యక్రమానికి పెద్దగా ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. జనం లేక సభా ప్రాంగణం వెలవెలబోవడంతో నిర్వాహకులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
