కొడుకు బర్త్‌డే కోసం అమెరికా వెళ్దామనకుంటే.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కిన నటి!

Cyber Crime

Cyber Crime

Cyber Crime: టాలీవుడ్‌లో ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి అనితా చౌదరి (గోగినేని అనిత) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. సామాన్యులనే కాదు, సెలబ్రిటీలను కూడా సైబర్ కేటుగాళ్లు ఏమాత్రం వదలడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. విమాన టికెట్ల బుకింగ్ పేరుతో ఆమెను నమ్మించి, ఏకంగా రూ. 4,14,180 కాజేశారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ కావూరి హిల్స్‌లో నివాసం ఉంటున్న ఆమె, జరిగిన మోసాన్ని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

తక్కువ ధరకే బిజినెస్ క్లాస్ అంటూ వల..

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో సంతోషంగా పాల్గొనాలని అనితా చౌదరి భావించారు. ఇందుకోసం నవంబర్ 12వ తేదీన ఆన్‌లైన్‌లో విమాన టికెట్ల కోసం వెతకడం ప్రారంభించారు. సరిగ్గా ఇదే సమయంలో ‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ ప్రతినిధిగా పరిచయం చేసుకుంటూ రాజేశ్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. వాషింగ్టన్ వెళ్లి రావడానికి తమ వద్ద అత్యంత తక్కువ ధరకే బిజినెస్ క్లాస్ రౌండ్ ట్రిప్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని మాయమాటలు చెప్పి ఆమెను పూర్తిగా నమ్మించాడు.

ఓటీపీ చెప్పిన నిమిషాల్లోనే ఖాతా ఖాళీ..

సదరు ఏజెంట్ మాటలను విశ్వసించిన అనితా చౌదరి, టికెట్ బుకింగ్ ప్రక్రియ కోసం అతడు అడిగిన డెబిట్ కార్డు వివరాలను అందించారు. రౌండ్ ట్రిప్ టికెట్ ధర రూ. 4,14,180 అవుతుందని చెప్పిన నిందితుడు, పేమెంట్ ప్రాసెసింగ్ కోసమంటూ ఆమె ఫోన్‌కు వచ్చిన ఓటీపీలను (OTP) కూడా చాకచక్యంగా అడిగి తెలుసుకున్నాడు. ఆమె ఓటీపీలు చెప్పిన మరుక్షణమే క్లియర్‌ట్రిప్ వేదికగా ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ. 4.14 లక్షలు డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత ఎంతసేపటికీ టికెట్ కన్ఫర్మేషన్ రాకపోవడం, ఫోన్ చేసినా రాజేశ్ స్పందించకపోవడంతో తాను దారుణంగా మోసపోయానని ఆమెకు అర్థమైంది.

పోలీసుల దర్యాప్తు.. ప్రయాణికులకు కీలక హెచ్చరిక

వెంటనే అప్రమత్తమైన నటి అనిత, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జరిగిన మోసంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజేశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, డబ్బు ఏ ఖాతాలోకి బదిలీ అయిందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో గూగుల్ సెర్చ్ ద్వారా దొరికే అనధికారిక ట్రావెల్ ఏజెన్సీల నంబర్లను గుడ్డిగా నమ్మవద్దని పోలీసులు ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ బ్యాంక్ కార్డు వివరాలు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు.