ఎర్రికుక్క కరిచింది.. ఎర్రగడ్డకు తీసుకెళ్తారు!’ సొంత పార్టీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, ఒకవైపు ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే, మరోవైపు సొంత పార్టీలో బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న కొందరు నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తాను ఇంకా రెండేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి, ప్రభుత్వ పనితీరుపై మాట్లాడేటప్పుడు పార్టీ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు.

‘ఎర్రికుక్క కరిచినోళ్లను ఎర్రగడ్డకు తీసుకెళ్తారు’

ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన బహిరంగ వ్యాఖ్యలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఘాటు స్పందన ఇచ్చారు. వెనుకటికి పెద్దలు ‘చెడును చెవిలో చెప్పాలి, మంచిని మైక్‌లో చెప్పాలి’ అని అన్నారని, కానీ తమ పార్టీలో కొందరికి ఏమైందో, ఎర్రికుక్క కరిచిందో తెలియదు గానీ చెడంతా మైక్‌లో చెబుతూ, మంచిని తన చెవిలో చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేయని పనులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, చేసిన మంచిని ఊరూరా ప్రచారం చేయాలని సూచించారు. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడే అటువంటి నేతలను కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్తారని సీఎం వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

అమరుల కుటుంబాలకు సముచిత గౌరవం

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు సముచిత స్థానం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లిని, అలాగే తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమించి గౌరవించామని తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక ఉద్యమకారులకు, అర్హులకు ఇంకా ఎంతో చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

‘పాపాల భైరవుడి’ కుట్రలు.. ఫామ్‌హౌస్ రాజకీయాలపై నిప్పులు

ప్రతిపక్ష నేతలపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “మీ దగ్గర రూ. లక్ష కోట్లకు పైగా ఆస్తులు ఉన్నది నిజం కాదా? పంచభూతాలను చెరపట్టింది మీరు కాదా?” అంటూ నిలదీశారు. పోలీసులు డ్యూటీకి వెళ్లకుండా ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని, మరి గత మూడేళ్లుగా అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లోనే పడుకున్న ప్రతిపక్ష నాయకులను ఏం చేయాలని ప్రశ్నించారు.

“పాపాల భైరవుడు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాగునీటి ముసుగులో మళ్లీ కుట్రలు చేస్తున్నారు. నేను ఆంధ్రాకు నీళ్లు వదులుతున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఇదే తెలంగాణ గడ్డపై పుట్టినవాడిని.. ఇక్కడి మట్టిలోనే కలుస్తాను కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఎన్నటికీ తాకట్టు పెట్టను” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తంమీద సీఎం ప్రసంగం అటు విపక్షాలకు, ఇటు సొంత పార్టీ అసమ్మతి నేతలకు స్పష్టమైన సందేశాన్ని పంపినట్లయింది.