2028లో మళ్లీ కేసీఆరే సీఎం.. వరంగల్ వేదికగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Telangana Politics

Telangana Politics

Telangana Politics: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి తుగ్లక్ ఆలోచనలని, ఆయన పాలనలో అవినీతి విజృంభించడం తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. వరంగల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించారు. చెప్పిన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి మళ్లీ పాత రోజులను తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే 2028 ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని, ప్రజలు నాటి బీఆర్ఎస్ పరిపాలనను ఒకసారి గుర్తుచేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

వరంగల్ అభివృద్ధికి బీఆర్ఎస్ పునాదులు

వరంగల్ నగర అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలోనే బలమైన పునాదులు పడ్డాయని, తమ ప్రభుత్వ కృషి వల్లే వరంగల్‌కు ఐటీ కంపెనీలు తరలివచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ తాగునీటి పథకాన్ని ఇక్కడే విజయవంతంగా అమలు చేశామని, అవుటర్ రింగ్ రోడ్డు పనులను కూడా ఒక కీలక దశ వరకు తీసుకెళ్లామని వివరించారు. కాంగ్రెస్ నేతలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కోటి మందిని కోటీశ్వరులను చేస్తానని గొప్పలు చెప్పిన రేవంత్‌రెడ్డికి, అసలు లక్ష మందినైనా లక్షాధికారులను చేసే దమ్ముందా అని కేటీఆర్ ప్రశ్నించారు.

పెన్షన్ల కోతపై నిలదీత

సంక్షేమ పథకాల అమలులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 4 లక్షల 71 వేల పాత పెన్షన్లను తొలగించి, ఇప్పుడు 4 లక్షల 63 వేల మందికి కొత్త పెన్షన్లు ఇస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాబోయే కార్పొరేషన్, పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.