మహిళా కలెక్టర్‌కు ఎమ్మెల్యే వేధింపులు.. ఎట్టకేలకు కేసు నమోదు, హైకోర్టు సీరియస్!

Arul Vignesh

Arul Vignesh

Arul Vignesh: తమిళనాడులోని కల్లకురిచి నియోజకవర్గ అధికార టీవీకే ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకరమైన వాట్సాప్ సందేశాలు పంపడంతో పాటు, ఆమె అధికారిక నివాసంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు మద్రాస్ హైకోర్టుకు వెల్లడించారు.

కలెక్టర్ ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం:

చెన్నైకి చెందిన మహిళా న్యాయవాది ఆర్. త్రిశూలి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ విచారణ జరిపారు. సోమవారం జరిగిన విచారణ సమయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, ఆ తర్వాత జిల్లా కలెక్టర్ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు.

ఉన్నతాధికారితో దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం:

ఈ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు ఉన్నందున, విచారణ పారదర్శకంగా సాగేందుకు ఎస్పీ స్థాయి కంటే పైస్థాయి అధికారితో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టంగా సూచించింది. అలాగే, ఈ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియాలో ఉన్న అసభ్యకర పోస్టులను తొలగించడంలో సైబర్ విభాగం చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించింది. దర్యాప్తు బృందాల వివరాలు, కమిటీ ఏర్పాటుపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది.