విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.. అనుమతుల్లేని భవనంలో ‘లా మెంటోరా’ దందా!

La Mentora

La Mentora

La Mentora: రాష్ట్రంలో కోచింగ్ సెంటర్లు, అకాడమీల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని టీసీఎస్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ‘లా మెంటోరా’ (La Mentora) ఐఐటీ-జేఈఈ/నీట్ అకాడమీ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘లా ఎక్సలెన్స్’ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, వివిధ జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కౌన్సెలింగ్ కార్యక్రమాల పేరుతో ఆకర్షిస్తూ ఇక్కడ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. అయితే, ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ఈ సంస్థను నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

నిర్మాణంలో ఉన్న భవనం.. కనీస అనుమతులు శూన్యం

ఆదిభట్ల ప్రధాన రహదారిపై రత్నదీప్ సూపర్ మార్కెట్ పైఅంతస్తుల్లో ఈ అకాడమీ నడుస్తోంది. ఈ భవనంలో ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతుండగానే, కనీస బిల్డింగ్ పర్మిషన్ గానీ, అగ్నిమాపక శాఖ (ఫైర్) అనుమతులు గానీ లేకుండానే వందలాది మంది విద్యార్థులతో తరగతులు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు గ్రౌండ్ ఫ్లోర్‌లో కమర్షియల్ కార్యకలాపాలు, మరోవైపు నిర్మాణ పనుల మధ్య విద్యార్థులను ఉంచడం వారి భద్రతను గాలికొదిలేయడమేనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, కోచింగ్ అకాడమీ అని చెబుతూనే ఇంటర్మీడియట్ తరగతులు నడుపుతూ లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని, అసలు విద్యార్థులకు ఏ కళాశాల పేరు మీద హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇస్తారో కూడా స్పష్టత లేదని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

విద్యార్థిని ప్రాణం పోయినా మేల్కొనని యంత్రాంగం

మూడు వారాల క్రితం (నవంబర్ ప్రారంభంలో) ఇదే కళాశాల హాస్టల్‌లో కందుకూరుకు చెందిన మోక్షజ్ఞ (17) అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద రీతిలో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తోటి విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగినప్పటికీ, సంబంధిత శాఖల అధికారులు ఈ సంస్థ అనుమతులపై లోతైన విచారణ జరపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు, ఉన్నత విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్నది అధికారుల అలసత్వమా? లేక ధనప్రవాహంతో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఇలాంటి అకాడమీలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.