AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరు 5 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 15 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘పెట్టుబడుల రక్షణ చట్టం’ (ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్) బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.
రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక పెట్టుబడులకు రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా చట్టపరమైన రక్షణ కల్పించడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలు, భూ కేటాయింపుల విషయంలో విధానపరమైన ఆకస్మిక మార్పులు జరగకుండా నిరోధించేలా ఈ బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలోనే తొలిసారిగా ఈ తరహా చట్టాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో దాదాపు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో, పారిశ్రామికవేత్తల్లో మరింత నమ్మకాన్ని పెంచేందుకు ఈ చట్టాన్ని వేగంగా తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడిదారుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ప్రభుత్వం దీనిపై తీవ్రంగా దృష్టి సారించిందని, తప్పకుండా చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
పెట్టుబడుల రక్షణ బిల్లుతో పాటు రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం.
