పిల్లల సోషల్ మీడియా వాడకానికి కొత్త రూల్స్.. ఇకపై తల్లిదండ్రుల చేతిలోనే రిమోట్!

Social Media

Social Media

Social Media: నేటి డిజిటల్ యుగంలో పిల్లలు, టీనేజర్లు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారనే ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక దిశగా అడుగులు వేస్తోంది. విదేశాల తరహాలో 16 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులపై సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించడం కంటే, ప్లాట్‌ఫారమ్‌లనే సురక్షితంగా మార్చి వారి వినియోగాన్ని నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ భావిస్తోంది.

నిషేధం కంటే నియంత్రణే మేలు

పూర్తిస్థాయి నిషేధం విధిస్తే పిల్లలు నియంత్రణలేని ఇతర వేదికల వైపు మొగ్గే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వయసు ఆధారిత నిషేధాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకుని, కేంద్రం మధ్యేమార్గాన్ని ఎంచుకుంటోంది. పిల్లలను సోషల్ మీడియాకు దూరం చేయడం కంటే, ఆ వేదికలపై సురక్షిత వాతావరణం కల్పించడమే సరైన పరిష్కారమని ప్రభుత్వం యోచిస్తోంది.

పరిమితులు, తల్లిదండ్రుల పర్యవేక్షణ

టీనేజర్లు సోషల్ మీడియాలో గడిపే సమయంపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రోజుకు రెండు గంటలకే పరిమితం చేయడం, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యాక్సెస్ నిలిపివేయడం, పాఠశాల వేళల్లో నోటిఫికేషన్లు రాకుండా చూడటం వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. స్మార్ట్ పరికరాలను వరుసగా 15 నిమిషాలు వాడితే విరామం తీసుకోమని అలర్ట్ పంపే విధానం కూడా పరిశీలనలో ఉంది. ఈ నిబంధనలను మార్చాలన్నా, సడలించాలన్నా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు.

డేటా రక్షణ దిశగా అడుగులు

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారిని చిన్నారులుగా పరిగణిస్తారు. వారి సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి తల్లిదండ్రుల ధ్రువీకరించిన అనుమతి అవసరం. ఇందుకు అనుగుణంగా వాట్సాప్ వంటి సంస్థలు ఇప్పటికే భారత్‌లో కొందరు వినియోగదారుల పుట్టిన తేదీని నిర్ధారించే ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నాయి. టీనేజర్ల డిజిటల్ భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం తీసుకోబోయే తుది నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.