Vishwamangalya Sabha: సమకాలీన సవాళ్లకు సమాధానం ‘యుగానుకూల మాతృత్వం’

RSS Chief Mohan Bhagwat addressing Vishwa Mangalya Sabha event in Hyderabad

విశ్వ మాంగల్య సభ సమావేశాల్లో RSS అధినేత మోహన్ భగవత్

మినిట్2మినిట్ డెస్క్, హైదరాబాద్: విశ్వ మాంగల్య సభ ఆధ్వర్యంలో నగరంలోని యూసుఫ్‌గూడ‌లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రబోధన్ బైఠక్’ సమావేశాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆదివాసీ భవన్‌లో జరిగిన “యుగానుకూల మాతృత్వం” సదస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు.

మాతృత్వమే మానవ మనుగడకు మూలాధారం
సృష్టికి, పోషణకు, మానవ మనుగడ కొనసాగింపునకు మాతృత్వమే మూలాధారమని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మాట్లాడటానికి అనుభవాన్ని మించిన శక్తి లేదని, భారతీయ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది కాబట్టి ఇక్కడి మాతృత్వం కూడా అంతే ప్రాచీనమైనదని పేర్కొన్నారు. గత కొన్ని శతాబ్దాలుగా సాగిన పరాయి పాలన, అన్య సంస్కృతల ప్రభావం వల్ల భారతీయ నిత్య జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఈ నేపథ్యంలోనే ‘యుగానుకూల మాతృత్వం’ (సమకాలీన మాతృత్వం) పై చర్చించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.

సమాజంలో కుటుంబ విలువలు, భార్యాభర్తల బాధ్యతలు, వివాహ వ్యవస్థ ప్రాధాన్యతను ఆయన గుర్తుచేశారు. కుటుంబంలో విలువలు త్యాగం నుంచే ఏర్పడతాయని వ్యాఖ్యానించారు. “సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానులే. అయితే స్త్రీకి ప్రతిసృష్టి చేయగల ప్రత్యేక శక్తి ఉంది. మన సంస్కృతిలో మహిళను శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. మారుతున్న కాలంలో మహిళలను దాసిగా చూడటం ఏమాత్రం తగదు. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు సహజం. అయితే ప్రాచీన ఆచారాలకే పరిమితం కావడం ఎంత సాధ్యం కాదో, పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరించడం కూడా అంతే హానికరం” అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

Vishwa Mangalya Sabha South India Prabodhan Baithak in Hyderabad

ఈ ప్రబోధన సమావేశాలలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని మార్గదర్శనం చేశారు. జితేంద్రనాథ్ మహారాజ్ (విశ్వ మాంగల్య సభ వ్యవస్థాపకులు), రుశాలి జోషి (జాతీయ సంఘటన మంత్రి), ప్రశాంత్ హోల్కర్ (అఖిల భారత విశ్వ మాంగల్య సభ మార్గదర్శకులు), నళిని హవాడే (విశ్వ మాంగల్య సభ జాతీయ అధ్యక్షురాలు), సూరజ్ దామోర్ (జాతీయ ఉపాధ్యక్షుడు), భగవతి బాల్డ్వా (స్వాగత సమితి అధ్యక్షురాలు), శృతి బొడ్డుపల్లి (సహ కార్యదర్శి) తదితరులు పాల్గొన్నారు.

దక్షిణ భారత రాష్ట్రాల ప్రతినిధుల హాజరు

ఈ సమావేశాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర దక్షిణ భారత రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది విశ్వ మాంగల్య సభ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా ప్రతినిధులు, ప్రముఖులు, మాతృమూర్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.