వాళ్లు మా ఆడపిల్లలను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం
వేళాపాళా లేకుండా తిరుగుతున్నారంటూ ఆరోపణలు
సంచలనంగా మారిన మహిళల వ్యాఖ్యలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
మినిట్ 2 మినట్, ట్రెండింగ్ టాపిక్: ఆన్లైన్ షాపింగ్, క్విక్ డెలివరీ యాప్‌ల వినియోగం పెరిగిన తర్వాత నిమిషాల్లో వస్తువులను ఇళ్లకు చేరవేసే డెలివరీ బాయ్స్ సేవలు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అయితే, ఇటీవల కొన్ని నివాస ప్రాంతాల్లో (కాలనీల్లో) డెలివరీ రైడర్ల ప్రవర్తనపై స్థానిక మహిళలు, నివాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో, స్థానిక మహిళ ఒకరు డెలివరీ బాయ్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ వీధుల్లో డెలివరీ రైడర్లు పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడుపుతున్నారని, వేళపాళా లేకుండా సంచరిస్తూ, అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్లల భద్రతకు ఇది ముప్పుగా పరిణమిస్తోందని, వారిని భరించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నాణేనికి మరోవైపు.. రైడర్ల కష్టాలు
మరోవైపు, ఈ ఆరోపణలపై డెలివరీ బాయ్స్‌ను మినిట్ 2 మినిట్ కదిలించింది. వారు స్పందిస్తూ, నిమిషాల్లో డెలివరీ పూర్తి చేయాలనే కంపెనీల ఒత్తిడి వల్ల వేగంగా వెళ్లాల్సి వస్తోందే తప్ప, ఎవరికీ ఇబ్బంది కలిగించే ఉద్దేశం తమకు ఉండదన్నారు. ఎండనకా, వాననకా కష్టపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను అందరూ అనుమానాస్పదంగా చూడటం బాధాకరమని పేర్కొన్నారు. ఎవరో కొంతమంది చేసే అతి వల్ల, వారి ప్రవర్తన వల్ల అందరు డెలివరీ బాయ్స్‌ను ఒకే ఘాటన కట్టడం సరికాదని ఆవేదన వెలిబుచ్చారు.
పరిష్కారం ఏమిటి?
ఈ రకమైన ఘర్షణ వాతావరణం తగ్గాలంటే సంబంధిత యాజమాన్యాలు (Zepto, Rapido వంటి సంస్థలు) తమ రైడర్లకు ట్రాఫిక్ నిబంధనలు, నివాస ప్రాంతాల్లో ప్రవర్తించాల్సిన తీరుపై ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కాలనీ అసోసియేషన్లు సెక్యూరిటీ చెక్-ఇన్ వ్యవస్థను కఠినతరం చేయడం, డెలివరీ సంస్థలు వేగానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలు మార్చుకోవడం శ్రేయస్కరం. పరస్పర అవగాహన, బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే కాలనీల్లో భద్రతతో పాటు డెలివరీ బాయ్స్ ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవచ్చు.
