ANDHRAPRADESH: ప్రియాంక హత్య కేసులో కీలక మలుపు !

ప్రియాంక హత్య కేసులో కీలక మలుపు

విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజు నియామకం

సమగ్ర ఆధారాల సేకరణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

కేసు దర్యాప్తును వేగవంతం చేయనున్న స్పెషల్ ఆఫీసర్

మినిట్ 2 మినిట్, అమరావతి(ఆగస్ట్ 17): రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసు దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసి, సమగ్ర విచారణ జరిపేందుకు విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజును నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న దేవరాజుకు ఈ కేసు దర్యాప్తు పూర్తి బాధ్యతలను అప్పగించింది.

డాక్టర్ ప్రియాంక హత్య కేసుపై వేగవంతంగా, పారదర్శకంగా విచారణ పూర్తి చేసి, అన్ని కోణాల్లో నిరూపించదగిన ఆధారాలను సేకరించాలని ప్రభుత్వాదేశాల్లో పేర్కొన్నారు. నేరానికి ఒడిగట్టిన నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా పక్కాగా ఆధారాలు సిద్ధం చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.

ప్రభుత్వ ఉత్తర్వులు అందుకున్న ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజు త్వరలోనే విచారణను వేగవంతం చేయనున్నారు. ఈ నెల 3న రాత్రి రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ, తదనంతర పరిణామాల్లో అది హత్యగా తేలడంతో తీవ్ర సంచలనం నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసు విచారణను సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.