TELANGANA: ఎలక్ట్రిక్ ఆటోలకు భారీగా సబ్సిడీ !

ఎలక్ట్రిక్ ఆటోలకు భారీగా సబ్సిడీ

ప్రతి అర్హత కలిగిన యజమానికి రూ.1.50 లక్షల సబ్సిడీ

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన

మినిట్ 2 మినిట్, హైదరాబాద్(ఆగస్ట్ 17): హైదరాబాద్ నగరంలో కాలుష్య నివారణకు, పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగరంలో నడుస్తున్న పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకం-2026’ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఆటో యజమానికి రూ.1.50 లక్షల వరకు భారీ సబ్సిడీని అందజేయనున్నట్లు వెల్లడించారు.

సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఆటో యజమానికి ఈ పథకం వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఆటో యజమానులకు ప్రభుత్వం రెండు అవకాశాలను కల్పిస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆటోకు ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకోవడం లేదా పాత ఆటోను మార్చి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేయడం వంటి వెసులుబాటు కల్పించారు. ఏ విధానాన్ని ఎంచుకున్నా రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు.

మొత్తం రూ.200 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేస్తున్న ఈ వినూత్న పథకానికి రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇంధన ధరల భారంతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్ల నిర్వహణ ఖర్చులను తగ్గించడంతో పాటు, నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని అరికట్టడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.