narendramodi: కాక్రోచ్ పార్టీ దారిలోనే ‘డీఎన్‌పీ’ !

కాక్రోచ్ పార్టీ దారిలోనే ‘డీఎన్‌పీ’

ఎర్రకోట వేదికగా ప్రధాని ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యల ఎఫెక్ట్

వ్యంగ్య బాణాలతో నెట్టింట హల్‌చల్ చేస్తున్న ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ’

కేవలం 24 గంటల్లోనే 2 లక్షలకు పైగా ఫాలోవర్లతో సెన్సేషన్

మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ(ఆగస్ట్ 18): దేశంలో ఆన్‌లైన్ నిరసన ఉద్యమాలు సరికొత్త రూపాంతరం చెందుతున్నాయి. ఇటీవల ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సిజెపి) డిజిటల్ వేదికగా చేపట్టిన ఉద్యమం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే బాటలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వ్యాఖ్యానించిన ‘దిమాగీ నక్సల్స్’ (మేధో నక్సలైట్లు) పదం కేంద్రంగా మరో వినూత్న సెటైరికల్ ఉద్యమం తెరపైకి వచ్చింది.

ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో ‘దిమాగీ నక్సల్ జనతా పార్టీ’ (DNP) పేరిట సరికొత్త ఖాతా ప్రత్యక్షమైంది. ప్రారంభమైన 24 గంటల్లోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుని నెట్టింట సరికొత్త మైలురాయిని తాకింది. ‘ఆలోచించండి, పరిశోధించండి, ప్రతిఘటించండి’ అనే నినాదంతో అధికార పక్ష విధానాలను ఎండగడుతూ ఈ ఖాతా పంచుకుంటున్న పోస్టులు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

తాము భగత్ సింగ్ సిద్ధాంతాలను అనుసరిస్తున్నామని, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు ప్రయత్నిస్తే అది దేశభక్తులను అవమానించడమేనని డీఎన్‌పీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. తమ ఖాతాలపై సైబర్ దాడులు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు. మొత్తానికి ప్రధాని వ్యాఖ్యలను కౌంటర్ చేస్తూ డిజిటల్ వేదికపై పుట్టుకొచ్చిన ఈ ‘డీఎన్‌పీ’ ట్రెండ్ దేశంలో మారుతున్న నిరసన రూపాలకు అద్దం పడుతోంది.