gv narayanrao: సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత !

టాలీవుడ్‌లో విషాదం
సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత

మినిట్ 2 మినిట్ , మూవీ న్యూస్ : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) అనారోగ్య సమస్యలతో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామానికి చెందిన ఆయన, మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొంది సినీ రంగ ప్రవేశం చేశారు.

1976లో వచ్చిన ‘అంతులేని కథ’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఆయన, తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ‘ముత్యాల పల్లకి’, ‘చిలకమ్మ చెప్పింది’, ‘గ్యాంగ్ లీడర్’, ‘హిట్లర్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. బుల్లితెరపై పలు సీరియళ్ల ద్వారా కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

నటుడిగానే కాకుండా నిర్మాతగానూ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లి నీకు శుభం నాకు’ వంటి చిత్రాలను నిర్మించి ఘనవిజయాలు అందుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది.

జీవీ నారాయణరావు మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)తో పాటు పలువురు సినీ ప్రముఖులు, సహచర నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సినీ రంగానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. దశాబ్దాల పాటు నటుడిగా, నిర్మాతగా అలరించిన ఆయన మృతితో చిత్రసీమలో శోకఛాయలు అలముకున్నాయి.