సీజేపీ ఆందోళనపై హైపవర్ కమిటీ
సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
రిటైర్డ్ జడ్జీలు, మాజీ సీబీఐ డైరెక్టర్, మాజీ డీజీపీతో కమిటీ ఏర్పాటు
నేర చరిత్ర లేని అభ్యర్థులు, విద్యార్థులపై ఎఫ్ఐఆర్ల ఎత్తివేతకు కోర్టు సానుకూలత
జూలై 20 పార్లమెంట్ మార్చ్ వీడియోలు, సీసీటీవీ దృశ్యాల సమగ్ర పరిశీలన
మినిట్ 2 మినిట్, న్యూఢిల్లీ (ఆగస్ట్ 19): కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) నేతృత్వంలో జూలై 20న ఢిల్లీలో నిర్వహించిన విద్యార్థుల ఆందోళనలో జరిగిన పోలీసుల దౌర్జన్యాలు, అక్రమాలు, లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అత్యున్నత స్థాయి (హైపవర్) కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఈ కమిటీలో సుప్రీంకోర్టు, హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులు, సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ డీజీపీ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం తెలిపింది. జూలై 20 నాటి నిరసనలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, వీడియో ఫుటేజ్‌లను కమిటీకి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. ఆందోళనల సమయంలో మహిళా నిరసనకారులపై జరిగిన దాడి, లైంగిక వేధింపులు, ఆన్లైన్ ట్రోలింగ్‌పై వచ్చే ఫిర్యాదులను కూడా ఈ కమిటీ నిష్పాక్షికంగా విచారిస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
మరోవైపు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం అందరికీ ఉందన్న ధర్మాసనం.. నేరచరిత్ర లేని అమాయక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 142 ద్వారా వారిపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఎత్తివేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. అయితే తీవ్ర నేరాల నేపథ్యం ఉన్న వ్యక్తులపై నమోదు చేసిన కేసుల విచారణ ప్రత్యేకంగా కొనసాగుతుందని వివరించింది. కమిటీ సిఫారసుల ఆధారంగా తదుపరి న్యాయపరమైన చర్యలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది
