పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉన్న ఎస్బీఐ (SBI) ఏటీఎం వద్ద ఘరానా మోసం చోటుచేసుకుంది. డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన ఒక పెద్దాయనను దుండగుడు మోసం చేసి రూ.20,000/- నగదు కాజేశాడు. బాధితుడు ఏటీఎం కార్డును మిషన్లో పెట్టి, పిన్ నంబర్ ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, సహాయం చేస్తాననే పేరుతో దుండగుడు ఈ మోసానికి పాల్పడ్డాడు. అదే సమయంలో ఏటీఎం కార్డును మార్చేసి, బాధితుడి అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నాడు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో దుండగుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతని ముఖం, బట్టలు, శారీరక నిర్మాణం సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వ్యక్తి మీకు తెలిస్తే వెంటనే పెద్దాపురం పోలీసులకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.పెద్దాపురంలోని ఇతర ఏటీఎంల వద్ద భద్రతా లోపాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ముఠాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఏటీఎంలను ఉపయోగించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొత్త వారి సహాయం తీసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్, సీవీవీ (CVV) వంటి వివరాలను ఎవరికీ చెప్పకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఏటీఎంలలో కార్డు మార్చుకునే ముఠాలు సంచరిస్తున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
