రంగు పడేదెప్పుడు?.. బడి బాగుపడేదెప్పుడు?

School Negligence

School Negligence

School Negligence: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల, ప్రాథమిక పాఠశాల భవనాలు నిర్వహణ లేక అధ్వాన్నంగా మారాయి. గోడలకు రంగులు వేయక, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో భవనాలు రోజురోజుకూ శిథిలమవుతున్నాయి. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల్సిన బడి భవనాలు వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. పాఠశాల గోడలకు వేయాల్సిన పెయింట్ బాక్సులు దాదాపు రెండేళ్లుగా గదిలోనే మూలనపడి ఉండడం గమనార్హం.

పాఠశాల భవనాలకు కొత్త రంగులు అద్ది, ఆకర్షణీయమైన వాల్ పోస్టర్లు వేయడానికి ప్రభుత్వం పెయింట్ డబ్బాలను సరఫరా చేసింది. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల ఆ రంగుల డబ్బాలను ఇప్పటివరకు వినియోగించలేదు. గదిలోనే నిల్వ ఉండడంతో అవి పాడైపోయే ప్రమాదం ఏర్పడింది. డబ్బాల గడువు తేదీ పూర్తి కాకముందే ఆ పెయింటింగ్‌ను భవనాలకు వేయించాలని స్థానికులు కోరుతున్నారు. రంగులు వేస్తే పాఠశాల రూపురేఖలు మారడమే కాకుండా భవనం సురక్షితంగా ఉంటుంది.

ఈ సమస్యపై గ్రామ సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులకు విన్నవించారు. ప్రభుత్వ ఆస్తి వృథా కాకుండా, విద్యార్థులకు మంచి వాతావరణం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల భవనాలకు పెయింటింగ్ పనులు పూర్తి చేయించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.