Pakistan Blast: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. కొహాట్ జిల్లాలోని ఓల్డ్ పోలీస్ లైన్స్ సమీపంలో ఉన్న మసీదులో జుమా ప్రార్థనలు జరుగుతున్న సమయంలో శక్తిమంతమైన ఆత్మాహుతి బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
శుక్రవారం ప్రార్థనల కోసం స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో మసీదుకు తరలివచ్చిన సమయంలో ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడు. పేలుడు ధాటికి మసీదు భవనం పూర్తిగా కూలిపోగా, సమీపంలో ఉన్న దుకాణాలు, ఇతర భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొదట ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం వచ్చినప్పటికీ, ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతుల సంఖ్య 16కు చేరింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
ముమ్మరంగా సహాయక చర్యలు:
ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, ‘రెస్క్యూ 1122’ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కాగా, ఈ దారుణ ఆత్మాహుతి దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. ఘటన స్థలాన్ని పూర్తి ఆధీనంలోకి తీసుకున్న పాకిస్థాన్ భద్రతా బలగాలు ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేశాయి.
