VIJAYAWADA: హక్కుల సాధనకే మెగా డీఎస్సీ విజేతల పోరు!

హక్కుల సాధనకే మెగా డీఎస్సీ విజేతల పోరు!

విజయవాడ వీధుల్లో మార్మోగిన ఆత్మగౌరవ నినాదాలు

7 వేల మందికి పైగా ఉపాధ్యాయుల భారీ చలో విజయవాడ ర్యాలీ

ప్రతిభను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని తీవ్ర ఆగ్రహం

మినిట్ 2 మినిట్, విజయవాడ(ఆగస్ట్ 17): సొంత ప్రతిభ, అహర్నిశల కష్టం ఆధారంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన తమపై అసత్య ప్రచారాలు చేయడం తక్షణమే మానుకోవాలని మెగా డీఎస్సీ-2025 విజేతలు వైఎస్సార్సీపీ నేతలను హెచ్చరించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడి సాధించుకున్న ఉపాధ్యాయుల విజయాలను, ఆత్మగౌరవాన్ని కించపరచడం ఎంతమాత్రం తగదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆదివారం విజయవాడ నగరంలో ‘చలో విజయవాడ’ పిలుపులో భాగంగా డీఎస్సీ విజేతలు నిర్వహించిన ‘ఆత్మగౌరవ ప్రదర్శన’ ర్యాలీ అత్యంత భారీ స్థాయిలో సాగింది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు 7 వేల మందికి పైగా నూతన ఉపాధ్యాయులు, అభ్యర్థులు ఈ మహా ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వరకు దద్దరిల్లే నినాదాల నడుమ కొనసాగింది.

ఈ సందర్భంగా ఉపాధ్యాయ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎంతో శ్రమ తర్వాత సాధించిన మెగా డీఎస్సీ ఉద్యోగాల నియామకాలపై బురద జల్లడం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం భావితరాలకు విద్యనందించే నిరుద్యోగుల కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. తాము అర్హత సాధించి పారదర్శకంగా ఎంపికయ్యామని, తమ విజయాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం మానుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. కష్టపడి సాధించుకున్న ఉద్యోగ గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లనివ్వబోమని స్పష్టం చేశారు. వేలాది మంది ఉపాధ్యాయుల రాకతో విజయవాడ వీధులన్నీ ఆత్మగౌరవ నినాదాలతో హోరెత్తాయి.