అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ.. ఏకంగా సెక్రటేరియట్‌లోనే పట్టుబడ్డ లంచగొండులు

ACB Raid

ACB Raid

ACB Raid: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సాగిస్తున్న వరుస దాడులు లంచగొండి అధికారుల గుండెల్లో తీవ్ర భయాందోళనలు రేపుతున్నాయి. పరిపాలనా రంగాన్ని అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు ఏసీబీ అధికారులు చేపడుతున్న సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామస్థాయి కార్యాలయాల నుంచి మొదలుకొని అత్యున్నత అధికార కేంద్రాల వరకు ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా ఏసీబీ వరుస సోదాలు నిర్వహిస్తుండటం విశేషం.

పాలనా ప్రాంగణంలోనే దొరికిపోయిన వైనం
తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా గుండెకాయ లాంటి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోనే ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీలు సంచలనం సృష్టించాయి. రెవెన్యూ శాఖ పరిధిలోని ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) విభాగంలో ఓ బాధితుడికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందించేందుకు ఏకంగా రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. బాధితుడి సమాచారంతో పక్కా వ్యూహంతో దాడి చేసిన ఏసీబీ బృందం, సచివాలయ ఆవరణలోని ఆలయం వద్ద నగదు తీసుకుంటుండగా బాధ్యులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

పెద్దల హస్తంపైనా విచారణ ముమ్మరం
కేవలం కిందిస్థాయి సిబ్బంది మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో ధైర్యంగా లంచం డిమాండ్ చేయడం సాధ్యం కాదని, దీని వెనుక సదరు విభాగంలోని ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందనే అనుమానంతో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. సీఎంఆర్‌ఎఫ్ లాంటి అత్యవసర నిధుల విడుదలలోనూ లంచాలు దండుకుంటున్న తీరు ప్రజలను షాక్‌కు గురిచేస్తోంది.

ఏసీబీ పక్కా ప్రణాళికతో నిఘా పెట్టి దాడులు చేస్తుండటంతో సర్కారీ ఆఫీసుల్లో అక్రమాలకు పాల్పడే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరోవైపు ఏసీబీ చాకచక్యాన్ని, తక్షణ స్పందనను సామాన్య ప్రజలు విశేషంగా ప్రశంసిస్తున్నారు.