Ration Cards: తెలంగాణ శాసనమండలి వేదికగా రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మండలి సమావేశాల్లో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో అర్హులైన పేదలకు మాత్రమే రేషన్ కార్డులు మంజూరు చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న పంపిణీ వ్యవస్థను సమీక్షించి, పన్ను చెల్లింపుదారుల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కుటుంబాల సంఖ్యతో పోలిస్తే రేషన్ కార్డులు పొందుతున్న వారి సంఖ్య దాదాపు సమానంగా ఉండటం సరికాదని ఎమ్మెల్సీ భానుప్రసాద్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సుమారు 1.15 కోట్ల కుటుంబాలు ఉంటే, అందులో ఏకంగా 1.06 కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయని తెలిపారు. ఈ లెక్కన పరిశీలిస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట వంటి ధనిక ప్రాంతాలలోని గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూడా ఉచిత రేషన్ సౌకర్యం అందుతున్నట్లే భావించాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
అత్యంత అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందువల్ల అనర్హులను తొలగించి, నిజమైన పేదలను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. పన్ను చెల్లింపుదారుల కష్టార్జితమైన ప్రభుత్వ ధనాన్ని అర్హులైన వారికి మాత్రమే ఖర్చు చేయడం ద్వారా సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని ఎమ్మెల్సీ భానుప్రసాద్ సూచించారు.
