డ్రగ్స్‌పై అమ్మల ‘సహచరి’ సమరం.. మల్కాజిగిరి పోలీసుల వినూత్న ప్రయోగం

Sahachari Campaign

Sahachari Campaign

Sahachari Campaign: డ్రగ్స్ అనే మహమ్మారి నేటి యువతను నరకకూపంలోకి నెడుతూ ఎన్నో కుటుంబాల్లో తీవ్ర ఆవేదనను నింపుతోంది. మాదకద్రవ్యాల బారిన పడి దారితప్పుతున్న బిడ్డలను సన్మార్గంలోకి తెచ్చేందుకు, వారిలో సమూల మార్పు సాధించేందుకు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ తొలి మహిళా సీపీ బి. సుమతి అత్యంత దార్శనికమైన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్న సూత్రాన్ని పాటిస్తూ, కన్నతల్లి ప్రేమతోనే డ్రగ్స్ రాక్షసిని అంతమొందించవచ్చని నిరూపిస్తూ కన్నతల్లులనే యాంటీ డ్రగ్స్ స్క్వాడ్‌గా తీర్చిదిద్దుతున్నారు. క్రైమ్ ప్రివెన్షన్, డ్రగ్స్ కట్టడిలో మహిళలను భాగస్వాములను చేస్తూ ‘సహచరి’ అనే విప్లవాత్మక ప్రాజెక్టును ప్రారంభించారు.

ఈ సరికొత్త కమ్యూనిటీ పోలీసింగ్ ఉపాధిలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని మెప్మా (MEPMA), సెర్ప్ (SERP) విభాగాల సమన్వయంతో సుమారు 3,000 మంది స్వయం సహాయక బృందాల (SHG) మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన ఈ మహిళలు తమ పరిధిలోని ఇళ్లలో, నివాస ప్రాంతాల్లో, కాలనీలలో డ్రగ్స్ వాడకం లేదా క్రయవిక్రయాలకు సంబంధించిన అనుమానాస్పద కదలికలపై నిశితంగా నిఘా పెడతారు. ఏ చిన్న ఆనవాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తూ సమాచార వారథులుగా వ్యవహరిస్తారు.

ప్రస్తుతం జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మల్కాజిగిరి పోలీసులు మరింత దూకుడుగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ఈగిల్ ఫోర్స్ తెలంగాణ’, ‘సహచరి’ బృందాలతో కలిసి ‘గణేష్ సురక్ష సంకల్ప్’ పేరిట డ్రగ్స్ రహిత సమాజంపై విస్తృతమైన అవగాహన డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. నాగోల్, ఎల్బీనగర్, ఉప్పల్, బోయిన్‌పల్లి తదితర కీలక జోన్లలో ఉన్న ప్రధాన గణేష్ మండపాల వద్దకు వచ్చే భక్తులు, ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు.

మాదకద్రవ్యాల మహమ్మారిని మూలాల నుంచి నిర్మూలించడంలో కన్నతల్లులు వహిస్తున్న ఈ పాత్ర సమాజంలో గొప్ప మార్పునకు నాంది పలుకనుందన్న ఆశాభావం అందరిలో వ్యక్తమవుతోంది. మల్కాజిగిరి సీపీ బి. సుమతి తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం, పోలీస్ వ్యవస్థతో మహిళా శక్తులను అనుసంధానించిన తీరు రాష్ట్రానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. పోలీసు వ్యవస్థ సమర్థవంతమైన చర్యలకు, ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి ‘సహచరి’ నిలువెత్తు నిదర్శనంగా నిలవనుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు!