పేరుకే పెద్ద హోటళ్లు.. కిచెన్‌లోకి వెళితే వాంతులే!

Food Safety

Food Safety

Food Safety: బయట రంగురంగుల విద్యుత్ కాంతులు, లోపల ఆకర్షణీయమైన ఏర్పాట్లు చూసి పెద్ద హోటళ్లకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త! కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆర్భాటాలు చేసే పలు ప్రముఖ హోటళ్ల కిచెన్లలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయి. ప్లేట్లలో వేడివేడిగా వడ్డిస్తున్న రుచికరమైన ఆహారం వెనుక దారుణమైన అపరిశుభ్రత దాగి ఉంది. తెలంగాణ స్టేట్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అధికారులు ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నివ్వెరపోయే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న పలు హోటళ్లపై అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, చంపాపేట్, వనస్థలిపురం పరిధిలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం 10 ప్రత్యేక బృందాలు ఒకేసారి 20 ఆహార తయారీ కేంద్రాల్లో మెరుపు దాడులు నిర్వహించాయి. వీటిలో 9 కేంద్రాల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. ఈ అపరిశుభ్రతను చూసి తనిఖీ బృందాలే దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతున్న ఈ 9 హోటళ్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేశారు. వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

పలు హోటళ్ల వంటశాలల్లో ఫ్రిజ్‌లను తెరిచి చూసిన అధికారులకు దిమ్మతిరిగే దృశ్యాలు కనిపించాయి. రోజులు గడిచినా నిల్వ ఉంచిన కుళ్లిన మాంసం, ఫంగస్ పట్టిన చికెన్ లభ్యమయ్యాయి. ఆ కుళ్లిన మాంసాన్నే రసాయనాలు కలిపి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ లభించిన నిల్వ ఆహార పదార్థాలను అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. సరైన ఫుడ్ లైసెన్సులు లేకుండా, ఆహార భద్రతా నిబంధనలను బొందపెట్టి వ్యాపారాలు సాగిస్తున్న నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాణాలు పాటించని పలు ప్రముఖ రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. గెలాక్సీ కేఫ్, అంటెరా, లక్కీ రెస్టారెంట్, జాయింట్ అల్ మండి, విజయ రాఘవేంద్ర హోటళ్లకు షోకాజ్ నోటీసులు అందజేశారు. అలాగే వన్‌లాంజ్, కేఫీ కేఫ్, గ్రీన్‌లాండ్ దాబాలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు ఇచ్చారు. ఇటువంటి అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసే ఆహారాన్ని తింటే ఆసుపత్రుల పాలు కాక తప్పదని అధికారులు హెచ్చరించారు. కల్తీ, అపరిశుభ్ర ఆహారాన్ని అరికట్టే వరకు ఈ దాడులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.