Bandi Sanjay: పదవులు, హోదాల కంటే తోటి మనుషుల ప్రాణాలు ముఖ్యం అని నిరూపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రోడ్డు ప్రమాదంలో గాయపడి విలవిలలాడుతున్న బాధితులను చూసి వెంటనే స్పందించడమే కాకుండా, తన భద్రతా సిబ్బందితో కలిసి ఆపన్నహస్తం అందించి తనలోని మానవతా హృదయాన్ని చాటుకున్నారు.
గజ్వేల్ శివారులో ఒక కారు వేగంగా వెళ్తూ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ, సరైన సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారు ముందు సీట్లో ఉన్న భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెనుక సీట్లో కూర్చున్న వారి కుమార్తెకు మాత్రం తీవ్ర గాయాలై కారులోనే చిక్కుకుపోయింది.
సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ ఘోర ప్రమాదాన్ని గమనించారు. ప్రొటోకాల్, కాన్వాయ్ వేగం వంటివేవీ పట్టించుకోకుండా వెంటనే తన కారును ఆపేశారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకుని కారులో చిక్కుకున్న బాధితులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారికి ఏమాత్రం సమయం వృథా కాకుండా చూడాలనే ఉద్దేశంతో, తన కాన్వాయ్‌లోని పోలీస్ వాహనంలోనే వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యులతో మాట్లాడి అత్యవసర చికిత్స ఏర్పాటు చేయాలని అక్కడే ఉన్న పోలీసులను ఆదేశించారు. క్లిష్ట సమయంలో ప్రజాప్రతినిధిగా కాక, ఒక సామాన్య మనిషిగా బండి సంజయ్ స్పందించిన తీరు స్థానికులను, ప్రత్యక్ష సాక్షులను ఎంతో ఆకట్టుకుంది.
