కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ‘వారసత్వ’ శిక్షణ.. గులాబీ దళానికి కొత్త నాయకుడు?

Himanshu Rao

Himanshu Rao

Himanshu Rao: తెలంగాణ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వేదికగా కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆయన మనవడు, కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు గడుపుతున్న సమయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. తాత దగ్గర తెలంగాణ సామాజిక, గ్రామీణ వాస్తవికతను నేర్చుకుంటూ, తండ్రి నుంచి ఆధునిక రాజకీయ వ్యూహాలను అందిపుచ్చుకుంటూ భవిష్యత్ నాయకుడిగా రూపాంతరం చెందే ప్రక్రియ ఎర్రవల్లి నుంచే ప్రారంభమైందనే ప్రచారం జోరందుకుంది.

తాజాగా సెప్టెంబర్ 6న జరిగిన బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశంతో పాటు సెప్టెంబర్ 8న కాంగ్రెస్ నిరసనల ఉద్రిక్తతల సమయంలో హిమాన్షు ఎర్రవల్లిలోనే ఉన్నారు. వినాయక చవితి వేడుకల్లో కేసీఆర్‌తో కలిసి ఉన్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. గతంలో గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పర్యవేక్షించిన అనుభవం హిమాన్షుకు ఉంది. ప్రస్తుతం పలు జిల్లాల్లో హిమాన్షు ఫొటోలతో డిజిటల్ బ్యానర్లు వెలియడం, బీఆర్‌ఎస్ నేతలతో ఆయన నేరుగా ముఖాముఖి సంభాషిస్తుండటం పరిశీలిస్తే.. పార్టీలో క్రమంగా తనదైన ముద్ర వేసే దిశగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

తాత కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ప్రజల జీవన విధానంపై ఉన్న పట్టు.. భవిష్యత్ తరానికి నాయకత్వ పటిమను నూరిపోసేందుకు తోడ్పడతాయని బీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హిమాన్షును పక్కా ప్రణాళికతో ముందడుగు వేయించేందుకు కుటుంబ వర్గాలు సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎర్రవల్లి నుంచి మొదలైన ఈ నిశ్శబ్ద శిక్షణ మున్ముందు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో వేచి చూడాలి.