Relationship Advice: ఈ రోజుల్లో ప్రేమ, డేటింగ్ అనేవి యువత జీవితంలో చాలా సహజమైన భాగాలుగా మారిపోయాయి. మొదట్లో ఎంతో మధురంగా, వర్ణించలేనంత ఆనందంగా అనిపించే ఈ బంధాలు.. కొన్నిరోజులు గడిచేసరికి అనుకోని మనస్పర్థలు, భిన్నాభిప్రాయాల వల్ల చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి. కొందరిలో ప్రేమ పేరిట పెరిగే విపరీతమైన ఆవేశం, ఉన్మాదం ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా తెస్తుంటుంది. అందుకే ఒకరితో బంధంలోకి అడుగుపెట్టేముందు మనసుతో పాటు కొద్దిగా మెదడుకు కూడా పనిచెప్పాలని బంధాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఆందోళనలు లేకుండా మీ ప్రయాణం సఫీగా సాగాలంటే కొన్ని కీలకమైన అంశాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ఇది నిజమైన ప్రేమా.. లేక కేవలం ఆకర్షణా?
చాలామంది తమకు కలిగే ప్రాథమిక ఆకర్షణనే నిజమైన ప్రేమగా పొరబడుతుంటారు. ఆరంభంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేమన్నట్లుగా మాట్లాడటం, ప్రతి క్షణం పక్కనే ఉండాలనుకోవడం సహజం. అయితే నిజమైన బంధం ఎంత దూరమున్నా నిలబడుతుంది. అందుకే మీది నిజమైన ప్రేమో కాదో తేల్చుకోవడానికి డేటింగ్ సమయంలో కొద్దిరోజుల పాటు ఒకరికొకరు కాస్త దూరంగా ఉండి చూడండి. ఆ విరామంలో ఎదుటి వ్యక్తిపై మీకున్న భావాలు స్పష్టమవుతాయి. ఒకవేళ అది కేవలం కాలక్షేపానికే అనిపిస్తే, అక్కడితోనే ఆగిపోవడం ఇద్దరి భవిష్యత్తుకూ మంచిది.
ఆలోచనలకు గౌరవం లభించనప్పుడు స్వస్తి చెప్పడమే మేలు
ఏ బంధమైనా బలపడాలంటే ఒకరి అభిప్రాయాలకు, ఆలోచనలకు మరొకరు విలువ ఇవ్వడం అత్యంత ముఖ్యం. కొందరు తమ ఇష్టాఇష్టాలనే భాగస్వామిపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. ఎదుటివారి స్వేచ్ఛను, నిర్ణయాలను గౌరవించని ప్రవర్తన కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. బంధంలో మీ భాగస్వామి నిరంతరం మిమ్మల్ని నియంత్రించాలని చూస్తున్నా లేదా మీ నిర్ణయాలను చులకన చేస్తున్నా.. ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే శ్రేయస్కరం.
తొందరపాటు వ్యక్తిగత సమాచారం.. భవిష్యత్తుకు ప్రమాదం!
కాలక్షేపం కోసం, లేదా తాత్కాలిక సంతోషం కోసం బంధాల్లోకి అడుగుపెట్టడం వల్ల ఇద్దరి జీవితాలు ఇబ్బందుల్లో పడతాయి. ముందుగా మీ జీవిత లక్ష్యాలేంటి, భాగస్వామి నుంచి మీరేం ఆశిస్తున్నారో ఒక స్పష్టత తెచ్చుకోవడం అవసరం. అంతేకాకుండా పరిచయమైన కొత్తలోనే వ్యక్తిగత విషయాలు, రహస్యాలు, ఆర్థిక వివరాలు పూసగుచ్చినట్లు పంచుకోవడం ఎంతమాత్రం సరికాదు. కొత్త పరిచయాల్లో ఎప్పుడూ కొంత వ్యవధి, సరిహద్దులు (boundaries) పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే అనేక రకాల సైబర్, మానసిక సమస్యల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
