EAGLE Force: డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటి నంబర్ 1 స్థానంలో నిలిచింది. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేయడంతో పాటు సైబర్ నేరాల నివారణలో చూపిన అత్యుత్తమ పనితీరుకు గాను రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. న్యూఢిల్లీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన మూడో జాతీయ స్థాయి యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ అధిపతుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా తెలంగాణ అధికారులు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
డైరెక్టర్ సందీప్ శాండిల్య నేతృత్వంలో తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేపట్టిన సమన్వయ చర్యలు, వేగవంతమైన దర్యాప్తు, నిరోధక కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ విశిష్ట గుర్తింపు దక్కింది. మాదకద్రవ్యాల విక్రేతలు, నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపుతూ, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ ఫోర్స్ నిరంతరం శ్రమిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తూ సరఫరా మూలాలను సైతం గుర్తించి మట్టుబెట్టడంలో ఈ టీమ్ చూపిన చొరవను కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా అభినందించింది.
పోలీస్ శాఖలోని రెండు కీలక ప్రాధాన్య విభాగాల్లో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోవడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా యువతను కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యలకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది. రాబోయే రోజుల్లోనూ మాదకద్రవ్యాల మూలాలను పూర్తిగా తుడిచిపెట్టే వరకు ఈ సమరాన్ని మరింత తీవ్రతరం చేస్తామని తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
