భారీ వర్షంలోనూ స్థంభించని భాగ్యనగరం.. ముందస్తు చర్యలతో మెరిసిన ‘హైడ్రా’!

HYDRAA Hyderabad

HYDRAA Hyderabad

HYDRAA Hyderabad:  నగరంలో వర్షం వస్తే చాలు రహదారులు జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితుల నుంచి హైదరాబాద్‌ చాలావరకు బయటపడింది. హైడ్రా ముందస్తు అప్రమత్తతతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ముప్పు తప్పింది. మంగళవారం సాయంత్రం ఆఫీసుల నుంచి జనం ఇళ్లకు వెళ్లే సమయంలో 3.3 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసినప్పటికీ, ఎక్కడా పెద్దగా వరద నీరు నిలవకపోవడం విశేషం.

వరద కాలువలు, క్యాచ్‌పిట్లు, కల్వర్టుల్లో పూడికను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేయడంతో నగరవాసులకు ఊరట లభించింది. ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, కవాడిగూడ, జీడిమెట్ల, మూసాపేట, కూకట్‌పల్లి, మూసారంబాగ్, గాజుల రామారం ప్రాంతాల్లో కుండపోత వర్షం పడినా ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగలేదు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వంతెన కింద నిలిచిన నీటిని మోటార్ల సాయంతో తొలగించే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్యతో పాటు డీఎఫ్‌వోలు నగరంలో విస్తృతంగా పర్యటించారు. హైడ్రా ఎస్‌ఎఫ్‌వోలు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది, మెట్ టీమ్‌లు ముందే అప్రమత్తమై వరద పీడిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాయి.

సికింద్రాబాద్ క్లాక్‌టవర్ ఆర్‌యూబీ వంతెన కింద అడుగు మేర నీరు నిలవడంతో వెంటనే 25 హెచ్‌పీ మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపిణీ చేశారు. సాయంత్రం 7 గంటల వరకు 9 చోట్ల చెట్లు కూలిపోగా, 4 చోట్ల నీరు నిలిచినట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా బృందాలు వెంటనే సమస్యలను పరిష్కరించాయి.