కోట్ల నిధులు దేనికి..? పేదల కడుపుకోత ఎవరికి?

Hospital Negligence

Hospital Negligence

Hospital Negligence: ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం రోజురోజుకూ సన్నగిల్లుతోంది. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ఎస్ఎన్‌సీయు వార్డులో ఏసీ పేలి నవజాత శిశువులు మృతి చెందిన ఘోరం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కనీసం కళ్లు కూడా తెరవని పసికకూనలు అగ్నికీలల్లో కాలిపోతుంటే యంత్రాంగం నిద్రపోతోందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిండా కళ్లు తెరవని పసిపాపల ప్రాణాలు గాల్లో కలసిపోతుంటే తల్లుల కడుపుకోత వర్ణనాతీతంగా మారింది.

మరోవైపు వరంగల్ ఎంజీఎంలో భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగుల నెత్తిన పడుతున్నా పట్టింపు లేకపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దవాఖానాకు వస్తే రోగం నయమవుతుందనే ఆశతో వచ్చే రోగులకు, ఏ క్షణంలో పైకప్పు కూలి నెత్తిన పడుతుందోననే భయం పట్టుకుంది. అసలు ఆస్పత్రుల్లో భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పరిశీలించే నాథుడే కరువయ్యాడు.

లక్షల రూపాయల జీతాలు తీసుకునే ఆస్పత్రి సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులు అసలు ఆఫీసు గదుల్లోంచి బయటకు వస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజూ ఆస్పత్రుల నిర్వహణను పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపై లేదా? రోగుల కష్టాలు వారి కంటికి కనిపించడం లేదా? కరెంట్ సరిగ్గా ఉండదు, బాత్రూమ్‌లు అసలే శుభ్రంగా ఉండవు. కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.

దీనికితోడు లంచాలు మరిగిన కొందరు సిబ్బంది పేదల రక్తం తాగుతున్నారు. ఏ చిన్న రక్త పరీక్ష లేదా స్కానింగ్ చేసుకోవాలన్నా ఆస్పత్రిలో యంత్రాలు పనిచేయవనే సమాధానమే వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు బయటి ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లి వేలకు వేలు తగలేసుకోవాల్సి వస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి మరీ ప్రైవేటు దవాఖానాలకు పరిగెడుతున్నారు.

ప్రభుత్వాలు ఏటా బడ్జెట్‌లో కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ఘనంగా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. కానీ ఆ నిధులు ఏమవుతున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఇది అధికారుల దారుణ నిర్లక్ష్యమా, పాలకుల చేతగానితనమా అని సామాన్యుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడిగా విచారణ కమిటీలు వేయడం, కొన్ని ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అలవాటుగా మారింది. ఇకనైనా ఆస్పత్రుల్లో భద్రతను పెంచి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.