CURE Act: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం రూపొందించిన చారిత్రక బిల్లుకు మోక్షం లభించింది. అసెంబ్లీ ఆమోదించి పంపిన ఈ ప్రతిపాదనలపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతకం చేయడంతో క్యూర్ బిల్లుకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. గవర్నర్ ఆమోదముద్ర పడటంతో దశాబ్దాల చరిత్ర కలిగిన పాత జీహెచ్ఎంసీ-1955 చట్టం స్థానంలో ఇకపై కొత్తగా ‘క్యూర్-2026’ చట్టం అమల్లోకి రానుంది.
హైదరాబాద్ మహా నగరంలో సమగ్రమైన డిజిటల్ ఆధారిత పరిపాలనా వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో సర్కార్ ఈ ముందడుగు వేసింది. ‘ఒకే నగరం.. ఒకే పరిపాలన.. ఒకే చట్టం’ అనే విశాలమైన ధ్యేయంతో రూపొందించిన ఈ కొత్త చట్టం జీహెచ్ఎంసీతో పాటు ఎంఎన్సీ, సీఎన్సీల పరిధిలో విస్తృతంగా వర్తించనుంది. వేర్వేరు నిబంధనలు, గందరగోళ పరిధిల స్థానంలో ఏకీకృత పాలనా విధానం రావడంతో పౌర సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందే అవకాశం ఏర్పడింది.
ఈ నూతన చట్టం అమలుతో నగరంలో ఆక్రమణల నిరోధానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘హైడ్రా’కు చట్టపరమైన గుర్తింపు దక్కనుంది. దీనికితోడు ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునేందుకు అదనపు అధికారాలు కూడా లభించనున్నాయి. క్యూఆర్ పరిధిలోని మూడు ప్రధాన కార్పొరేషన్లను ఒకే తాటిపైకి తెస్తూ ఒకే ఏకీకృత పాలనా వ్యవస్థను అందుబాటులోకి తేవడం దీని ప్రధాన ఉద్దేశం. కాలం చెల్లిన పాత నియమ నిబంధనలను, అనవసరమైన ఆంక్షలను పూర్తిగా తొలగిస్తూ, ప్రస్తుత ఆధునిక అవసరాలకు తగినట్లుగా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం క్యూర్ చట్టం ముఖ్య లక్ష్యం. ఈ నిర్ణయంతో నగర విస్తరణ, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల్లో వేగం పెరగడంతో పాటు, సమస్యల పరిష్కారంలో జాప్యానికి తెరపడనుందని నిపుణులు భావిస్తున్నారు.
