Supreme Court: లైంగిక నేరాలకు పాల్పడే వారిలో ప్రాణభయం కలిగించేలా చట్టాలు, పోలీసుల చర్యలు ఉండాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పు చేస్తే కచ్చితంగా కఠినమైన శిక్ష పడుతుందనే భయాన్ని నేరస్థుల్లో నింపాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఇటీవల వరుసగా నమోదైన లైంగిక దాడి కేసులను సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం.. మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పందిస్తూ.. “లైంగిక నేరానికి ఒడిగడితే ఇక ప్రాణాలతో ఉండలేమనే భయాన్ని సంఘవిద్రోహ శక్తుల్లో కలిగించాలి. ఇకపై ఏదైనా తప్పు చేస్తే చచ్చిపోతామనే భయం నేరస్తుల్లో రావాలి” అని స్పష్టం చేసింది. ముందుగా బాలికల కళాశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అమ్మాయిలను వేధిస్తూ తిరిగే ఆకతాయిలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. అలాగే ఢిల్లీలో అక్రమంగా నిర్వహిస్తున్న తినుబండారాల కేంద్రాలు, మద్యం అందుబాటులో ఉండే ప్రదేశాలపై నిఘా సారించాలని పేర్కొంది.
ఇటీవల మైనర్ స్లీపర్ బస్సులో జరిగిన సామూహిక లైంగికదాడి ఘటనతో పాటు, దక్షిణ ఢిల్లీలోని ఒక పార్కులో బాలికపై జరిగిన దాడిని జస్టిస్ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. ఆ కళాశాలకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన జరగడంపై పోలీసుల తీరును నిలదీసింది. నిందితులు దారుణానికి ఒడిగట్టడానికి ముందు మద్యం సేవించి, తినుబండారాలు తిన్న విషయాన్ని గుర్తు చేసింది. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, అసలు నేరం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడం చాలా ముఖ్యమని తెలిపింది.
ఇలాంటి దారుణాలు పునరావృత్తం కాకుండా చూడాలంటే అన్ని విభాగాలు కలిసి పనిచేస్తేనే మార్పు వస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారానికి ఢిల్లీలో ప్రత్యేక ‘వార్ రూమ్’ ఏర్పాటు చేసే అంశంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. లైంగిక నేరాలకు పాల్పడిన అనుమానితులను జాతీయ స్థాయి లైంగిక నేరగాళ్ల డేటాబేస్ (NDSO) ద్వారా ట్రాక్ చేయాలని సూచించింది. రాబోయే వారాల్లో మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది.
