అర్హత లేని వైద్యం.. అమాయక ప్రాణాలకు శాపం.. నారాయణపేట జిల్లాలో విషాదం

RMP Doctor

RMP Doctor

RMP Doctor:  నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నిర్జింత గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అర్హత లేని ఆర్‌ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి ఇటికేల సాయమ్మ (43) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అనాలోచితంగా ఇచ్చే ఇంజెక్షన్లు అమాయక ప్రజల ప్రాణాలను ఎలా బలితీసుకుంటున్నాయనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.

బాధితుల కథనం ప్రకారం.. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సాయమ్మను భర్త మొగులప్ప స్థానిక ఆర్‌ఎంపీ డాక్టర్ తాజ్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షించిన ఆర్‌ఎంపీ, ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే సాయమ్మ ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. ఈ పరిణామంతో కంగారుపడిన ఆర్‌ఎంపీ డాక్టర్, మృతదేహాన్ని తన కారులో వేసుకుని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మృతదేహంతో ఆర్‌ఎంపీ డాక్టర్ ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల జరుగుతున్న ఘోరాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఆనారోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా, అర్హత లేని ఆర్‌ఎంపీల వద్ద విచక్షణారహితంగా ఇంజెక్షన్లు, శస్త్రచికిత్సలు చేయించుకోవడం ప్రాణాలకే ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపాటి అనారోగ్యం వచ్చినా అర్హత కలిగిన ప్రభుత్వ లేదా రిజిస్టర్డ్ వైద్యులను మాత్రమే సంప్రదించాలని, ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో ప్రాణాలను ప్రమాదంలో పడేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.