భారతీయ నావికుడు రాకేష్ చౌహాన్ (33) కేసులో సంచలనం. వెనిజులాలో మర్చంట్ నేవీలో పనిచేస్తూ మరణించిన విషయం తెలిసిందే. అయితే నెల రోజుల తర్వాత తాజాగా మృతదేహం స్వదేశానికి చేరుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. రాకేష్ శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలతో సహా ఏ ఒక్క అంతర్గత అవయవమూ లేదని వైద్యులు గుర్తించారు. మృతదేహంపై మెడ నుంచి మర్మాంగం వరకు 22 కుట్లు ఉన్నాయి. అవయవాలు లేకపోవడంతో మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేకపోయారు.
గత మే నెలలో నౌక డెక్‌పై పడి గాయపడిన రాకేష్, గుండెపోటుతో చనిపోయినట్లు కంపెనీ కుటుంబ సభ్యులకు తెలిపింది. కానీ, కీలక అవయవాల తొలగింపుపై సమాచారం ఇవ్వలేదు. దీంతో వెనిజులా సంస్థపై రాకేష్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ‘ఫెడరేషన్ ఆఫ్ సీఫేరర్స్ యూనియన్స్ ఆఫ్ ఇండియా’ కూడా ఈ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. కుటుంబ అనుమతి లేకుండా అవయవాలు ఎందుకు తీసేశారని ప్రశ్నించింది. మృతదేహ రసీదు నకిలీదని, నౌకల పేర్లలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ, భారత రాయబార కార్యాలయం తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.
