దిశ మార్చిన సింగరేణి లాభాల పంపిణీ.. 38 వేల మంది శాశ్వత ఉద్యోగులకు రూ.1.53 లక్షల చొప్పున చెల్లింపు!

Singareni Bonus

Singareni Bonus

Singareni Bonus: విజయదశమి పండుగ వేళ సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి ఉద్యోగులకు భారీ బొనాంజా ప్రకటించారు. శాశ్వత కార్మికులతో పాటు కాంట్రాక్టు వర్కర్లకు కూడా బోనస్ చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

సింగరేణి సంస్థకు రూ.1,754 కోట్ల మేర నికర లాభాలు వచ్చాయని, ఈ లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచుతున్నట్లు తెలిపారు. దీని ప్రకారం అర్హులైన 38 వేల మంది పర్మనెంట్ కార్మికులకు గరిష్ఠంగా రూ.1,53,913 వరకు బోనస్ అందనుంది. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు ప్రకటించారు. పండుగకు ముందే ఈ మొత్తాన్ని కార్మికుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామన్నారు. అహోరాత్రులు శ్రమిస్తూ సంస్థ అభివృద్ధికి మూలస్తంభంగా నిలిచిన కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

సొంతింటి కల సాకారం.. సమస్యల పరిష్కారం:

కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు ‘నెహ్రూ కాలనీల’ పేరుతో అధునాతన క్వార్టర్లను నిర్మించనున్నట్లు మంత్రులు వెల్లడించారు. సింగరేణి ఏరియా ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించి నాణ్యమైన అత్యుత్తమ వైద్యం అందిస్తామన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెబుతూ.. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 300 కారుణ్య నియామకాల భర్తీ ప్రక్రియను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలియాస్ పేర్ల అంశానికి సంబంధించి కూడా 15 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని, మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియ ఆయా ఏరియా ఆస్పత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.