Illegal Mining: అక్రమ మైనింగ్ వ్యవహారంలో తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామ ప్రజలు చేసిన మూకుమ్మడి దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన రాజస్థాన్లోని భొండా గ్రామంలో చోటుచేసుకుంది.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే అతర్ సింగ్ (68) స్థానికంగా ఉన్న ప్రభుత్వ గడ్డి భూములను అక్రమంగా ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారంటూ భొండా గ్రామ ప్రజలు కొంతకాలంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మూతపడిన స్టోన్ క్రషర్ను మాజీ ఎమ్మెల్యే తిరిగీ ప్రారంభించడంతో ఆగ్రహించిన గ్రామస్థులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
ఆందోళన కాస్తా ఉద్రిక్తంగా మారడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రజలు అతర్ సింగ్పై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
